ఉద్దానం కార్గో ఎయిర్‌పోర్ట్‌కు ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యం ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేయాలి — జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా డాక్టర్ సిపాన గుణవతి
Dabang Sahafat••14 వీక్షణలు•4 నిమిషాలు చదువు
శ్రీకాకుళం, ఆగస్టు 24: ఉద్దానం ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించడం ప్రజా ప్రయోజనాల కోసం కాని వేలాది మంది రైతులు, ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా ప్రైవేటు వ్యవసాయ భూములను సేకరించి ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ప్రయత్నాలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. సోమవారం నాడు శ్రీకాకుళంలో డాక్టర్ సిపాన గుణవతి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అడ్వైజర్ ఎస్ జి ప్రసాద్ జిల్లా ఇన్చార్జ్ ఎల్ గోవిందరాజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడ్డు సోమశేఖర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు వైశ్యరాజు మురళి తదితర నాయకులు పాల్గొన్నారు రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నా . ఉద్దానం కార్గో ఎయిర్పోర్ట్ స్థల సేకరణ సమావేశం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు
కార్గో ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన స్థల సేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించగా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించాలని ఆదేశాలు జారీ అయినట్లు సంఘం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు దాటి సుమారు రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక నిర్దిష్టమైన, ప్రజలకు ఆమోదయోగ్యమైన స్థలాన్ని ప్రభుత్వం ఖరారు చేయకపోవడం విచారకరమని పేర్కొంది.
ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నా రైతుల భూములపైనే ఎందుకు దృష్టి?
వజ్రపుకొత్తూరు మండలం నగరాలపల్లిలో సుమారు 1,990 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారిక రికార్డులు సూచిస్తున్నాయని సంఘం తెలిపింది. అలాగే మూలపేటలో షిప్‌యార్డ్ కోసం కేటాయించిన వేలాది ఎకరాల భూమిలో కొంత భూమి వినియోగంలో లేకపోతే, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై ముందుగా సమగ్ర పరిశీలన జరపాలని ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశం పరిశీలనలోకి తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు
ప్రభుత్వానికి చెందిన మిగులు భూములు, వినియోగంలో లేని భూములు, సాంకేతికంగా అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించకుండా మందస మండల పరిధిలోని సుమారు 20 గ్రామాల ప్రజలను ప్రభావితం చేసే ప్రాంతాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో జిల్లా యంత్రాంగం ప్రజలకు స్పష్టంగా వివరించాలని సంఘం కోరింది.
వేలాది మంది రైతుల జీవనాధారాన్ని దెబ్బతీయొద్దు
ప్రతిపాదిత ప్రాంతంలో పుష్కలమైన జల వనరులు, పచ్చని చెట్లు, సహజ వనరులతో పాటు ప్రజలకు అవసరమైన ఆహార పంటలను రైతులు సాగు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో నిర్మాణ ప్రజలతోపాటు వన్యమృగ ప్రాణ నష్టం కూడా జరుగుతుందని సంఘం పేర్కొంది. తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకరించని పరిస్థితుల్లో బలవంతపు భూసేకరణకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది.
ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పేరుతో రైతుల జీవనాధారం, సహజ జలాశయాలు, పర్యావరణ వ్యవస్థ దెబ్బతినకుండా “అభివృద్ధి కూడా కావాలి – ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణ కూడా కావాలి” అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరింది.
2013 భూసేకరణ చట్టంపై అధికారులకు అవగాహన ఉందా?
ప్రాంతంలోని కొంతమంది రైతులను 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఖాళీ చేయిస్తామని అధికారులు గతంలో హెచ్చరించినట్లు ఫిర్యాదులు వచ్చాయని సంఘం తెలిపింది. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముందు సంబంధిత అధికారులు భూసేకరణ, పునరావాసం, న్యాయబద్ధమైన పరిహారం, ప్రజాభిప్రాయం మరియు చట్టపరమైన ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది.
ప్రజల ఆస్తులు, వ్యవసాయ భూములు, జీవనాధారానికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయమైనా పారదర్శకంగా, చట్టబద్ధంగా, ప్రజల సమక్షంలో తీసుకోవాలని సంగం డిమాండ్ చేసింది.
పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇవ్వాలి
కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదిస్తున్న ప్రాంతంలో సహజ జల వనరులు, వ్యవసాయ భూములు, పచ్చదనం, పర్యావరణపరమైన ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అవసరమైన పర్యావరణ అధ్యయనాలు, సాంకేతిక సాధ్యతా నివేదికలు, పర్యావరణ అనుమతులు ఎలా పొందుతారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సంఘం కోరింది.
ప్రజల జీవనాధారాన్ని, ప్రకృతిని నాశనం చేసి అభివృద్ధి సాధించడమే నిజమైన అభివృద్ధి కాదని డాక్టర్ గుణవతి అన్నారు.
ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
గతంలో డాక్టర్ గుణవతి పర్యవేక్షణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజ నిర్ధారణ కమిటీ ప్రతిపాదిత ప్రాంతంలో పర్యటించి రైతులు, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుందని తెలిపారు. అక్కడి పరిస్థితులను పత్రికల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
కార్గో ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకత కాదని, ప్రజలకు నష్టం కలగకుండా, సరైన ప్రత్యామ్నాయ స్థలంలో, చట్టబద్ధమైన అనుమతులతో, పారదర్శకంగా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలన్నదే తమ డిమాండ్ అని డాక్టర్ గుణవతి స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సర్వేలు ఎందుకు?
రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన జీవో లేదా అధికారిక ఉత్తర్వులు జారీ చేయకుండానే జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిధిలో అనధికారికంగా సర్వేలు నిర్వహిస్తున్నారనే రైతుల ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలి. ఉద్దానం ప్రాంత అభివృద్ధికి కార్గో ఎయిర్‌పోర్ట్ అవసరమే అయినప్పటికీ, దాని కోసం వేలాది మంది ప్రజలను నిర్వాసితులను చేయడం, సారవంతమైన వ్యవసాయ భూములను నాశనం చేయడం, సహజ జల వనరులను దెబ్బతీయడం సమంజసం కాదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పేర్కొంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిని ఇంతవరకు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఎందుకు జాప్యం జరిగిందని అంశాలపై ప్రధానమంత్రి అధ్యక్షతన ఈనెల 25వ తేదీ సమావేశం సీరియస్ గా తీసుకోవాలండి సంఘం కోరింది. ఈ ప్రాంత ప్రజలు మత్సకారులు ఆర్థికంగా సామాన్యంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు ఈరోజు దేశానికి పౌర విమానయన శాఖ మంత్రిని గత ఎన్నికల్లో గెలిపించి అందించింది కూడా ఈ ప్రాంత ప్రజలేనని గుర్తించు కోవలసిన అవసరం ఎంత ఉంది. ఎయిర్పోర్ట్ స్థల సేకరణ విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్య మంత్రి ఉన్నతాధికార యంత్రాంగం పరిస్థితులను పరిశీలించి ప్రజలకు చట్టపరమైన ఆస్తి భద్రత కల్పించాలని డాక్టర్ గుణవతి కోరారు.